శ్రీ యాదాద్రి కాలనీలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

శ్రీ యాదాద్రి కాలనీలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

రాజేంద్రనగర్: సెప్టెంబర్ 16: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్‌పూర్ శ్రీ యాదాద్రి కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీలో గణపతికి ప్రత్యేక పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాలనీ వాసులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పి. కార్తీక్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు కార్తీక్ రెడ్డికి ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తీక్ రెడ్డి… గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, రాజేంద్రనగర్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సోదరభావంతో మెలగుతూ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలకతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్థానిక నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బండ్లగూడ జాగిర్ మాజీ మేయర్ మహేందర్‌ గౌడ్, మాజీ కార్పొరేటర్‌ సురేష్ గౌడ్, యాదాద్రి కాలనీ ప్రెసిడెంట్ మధుకర్, సభ్యులు మహేష్ కుమార్, రఘునందన్, వెంకట్, బుడ్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్