- తెలుగు తెరపై లోకల్ మ్యాజిక్
- బాక్సాఫీస్ లాక్స్ ఓపెన్..నౌ
అప్పట్లో టాలీవుడ్లో హీరోయిన్లు అనగానే ముంబై, చెన్నై లేదా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం ఒక ట్రెండ్‌గా ఉండేది. సౌత్ ఇండియాలో కేరళ నుంచి పలువురు హీరోయిన్లు టాలీవుడ్లో అగ్ర తారలుగా ఎదిగారు. అయితే ఆ హవా తగ్గింది. టాలీవుడ్లో ముంబై భామల హవాకు బ్రేకులు పడ్డాయి. చెన్నై సుందరీమణుల జోరు తగ్గింది. ఇప్పుడు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద కేవలం ఒకే ఒక్క హవా నడుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. సౌత్, నార్త్ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే విధానానికి దాదాపు పుల్ స్టాప్ పెడుతున్నారు. అచ్చమైన మన తెలుగమ్మాయిలు కావాలని అంటున్నారు. అందులోనూ హైదరాబాదీ గల్లీల నుంచి వచ్చిన నూతన తారలు సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, పాత్రలో జీవం పోస్తూ టాలీవుడ్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు తెలుగు ముద్దుగుమ్మలు. గౌరిప్రియ, వైష్ణవి చైతన్య, శివానీ నాగారం లాంటి యంగ్ హీరోయిన్ల వైపు ఇప్పుడు టాలీవుడ్ చూస్తోంది.

గతంలో హీరోయిన్ అనగానే ముంబై, చెన్నై లేదా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి దర్శక-నిర్మాతలు వెనుకాడేవారు. “తెలుగు అమ్మాయిలకు గ్లామర్ పండించడం రాదు, స్క్రీన్‌పై రొమాన్స్ చేయలేరు, కేవలం చిన్న పాత్రలకే పరిమితం” అనే ఎన్నో ముద్రలు, నిరాదరణలను ఎదుర్కొంటూ దశాబ్దాల క్రితం ఎంతోమంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చి, అవకాశాలు రాక కన్నీళ్లతో వెనుదిరిగిన చరిత్ర ఉంది. కానీ, కాలం మారింది. ఆ ఓటముల బూడిద నుంచే ఇప్పుడు టాలీవుడ్లో ఓ అద్భుతమైన శకం మొదలైంది. గతంలో తెలుగు అమ్మాయిలు పడిన ఆవేదన, ఎదుర్కొన్న రిజెక్షన్సే నేటి తరం భామలకు గట్టి పునాదిగా మారాయి. ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల్లో లోకల్ టాలెంట్ సునామీ నడుస్తోంది. ముంబై భామలకు గట్టి పోటీ ఇస్తూ మన హైదరాబాదీ గల్లీ గర్ల్స్ టాలీవుడ్ బాక్సాఫీస్‌పై తమ ముద్ర వేస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు గ్లామర్ అంటలేరు, యాక్టింగ్ రాదు అన్న వాళ్లతోనే ఇప్పుడు చప్పట్లు కొట్టిస్తున్నారు మన లోకల్ భామలు. అచ్చమైన తెలంగాణ యాస, హైదరాబాదీ బాడీ లాంగ్వేజ్‌తో టాలీవుడ్‌ను షాక్ ఇస్తున్నారు. ఒకప్పుడు “తెలుగు అమ్మాయిలకు గ్లామర్ రోల్స్ పండించడం రాదు” అనే అపోహ ఉండేది. కానీ దాన్ని ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మలు పూర్తిగా బ్రేక్ చేశారు. డబ్బింగ్ చెప్పించుకునే రోజులు పోయి, స్వయంగా తమ డైలాగ్స్‌తోనే ఎమోషన్స్‌ను పండిస్తూ డైరెక్టర్ల మొదటి ఛాయిస్‌గా మారుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన టాలెంటెడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ. ఇటీవల చెన్నై లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇందులో తన నటన చూసి థియేటర్లలో ప్రేక్షకులు కన్నీళ్లతో బయటకొచ్చారు. అంతల తన నటనతో ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో హీరోనే దామినేట్ చేసేసింది. ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ వంటి చిత్రాలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారామె. కేవలం అందాల ఆరబోత కాకుండా, పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్ దర్శక-నిర్మాల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ నుంచి మ్యాడ్ వరకు… ప్రతి సినిమాలోనూ ఒక ఫ్రెష్ వైబ్ తీసుకురావడం శ్రీ గౌరి స్పెషాలిటీ. లవ్ స్టోరీ అయినా, కాలేజీ కామెడీ అయినా ఈ అమ్మడు ఉంటే ఆ సీన్‌కి పదే పదే విజిల్స్ పడాల్సిందే. కేవలం అందం మాత్రమే కాదు, నటనలో లోతు చూపిస్తూ టాలీవుడ్ మేకర్స్‌కి మోస్ట్ వాంటెడ్ ఛాయిస్‌గా మారింది ఈ హైదరాబాదీ సుందరి. కేవలం తెలుగులోనే కాదు.. అటు తమిళంలోనూ నటిస్తూ…. తెలుగు సత్తా చాటుతోంది.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి..’బేబీ’ సినిమాతో బాక్సాఫీస్‌ను షాక్ చేసిన సంచలనం వైష్ణవి! ఆ సినిమాలో ఆమె పండించిన ఎమోషన్స్ చూసి ఇండస్ట్రీ పెద్దలే అవాక్కయ్యారు. ఇప్పుడు పెద్ద హీరోల సరసన, క్రేజీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంది. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల ద్వారా నటనను ప్రారంభించిన వైష్ణవి చైతన్య… ‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌ను ఒక్క ఊపు ఊపేశారు. ఆ చిత్రంలో ఆమె ప్రదర్శించిన సహజమైన నటన, ఎమోషనల్ వేరియేషన్స్ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి, ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘జాక్’ వంటి సినిమాలతో పాటు యూత్ ఫుల్, లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారుతున్నారు.

‘లిటిల్ హార్ట్స్’ లాంటి సినిమాలతో యూత్ హార్ట్స్‌లో శాశ్వతంగా గుడి కట్టేసుకుంది శివానీ. సినిమా ఏదైనా సరే, అందులో తన పాత్రకు వంద శాతం జీవం పోయడం ఈమె స్టైల్. ఎటువంటి మేకప్ లేకపోయినా కెమెరా ముందు సింపుల్‌గా మ్యాజిక్ చేయగల రేంజ్ టాలెంట్ ఈ హైదరాబాదీ బ్యూటీ సొంతం. ఏ పాత్రలోనైనా ఇన్‌స్టంట్‌గా ఒదిగిపోయే నైపుణ్యం ఆమె సొంతం. తెలుగు నేటివిటీ ఉట్టిపడే రూపం, అచ్చమైన తెలుగు పలుకుబడి ఆమెకు సినిమాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయారు.

ఒకప్పుడు టాలీవుడ్లో టాలెంట్ ఉన్నా సరే, కేవలం “తెలుగు అమ్మాయి” అనే ఏకైక కారణంతో ఎంతోమంది నూతన నటీమణులు ఆడిషన్స్ గడప దాటలేకపోయారు. “హైట్ సరిపోలేదు”, “స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సరసన సూట్ కారు” అంటూ ముఖం మీదే తలుపులు వేసిన సందర్భాలు అనేకం. డబ్బింగ్ చెప్పించుకోవడం రాదనే సాకుతో లోకల్ టాలెంట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ నిరాశతో ఎంతోమంది టాలెంటెడ్ అమ్మాయిలు సినిమాలే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ, ప్రేక్షకుల అభిరుచి మారడంతో మేకర్స్ ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది. బ్బింగ్ ఆర్టిస్టుల గొంతు కంటే, తెరపై స్వయంగా డైలాగ్ చెబుతూ ఎమోషన్స్ పండించే ‘రా టాలెంట్’ కావాలని జనం కోరుకున్నారు. ఈ మార్పును సరిగ్గా క్యాష్ చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మన హైదరాబాదీ భామలు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మల సక్సెస్ చూశాక, ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ముంబై నుంచి హీరోయిన్లను తెస్తే డబ్బింగ్ చెప్పించాలి, వాళ్లకు మన కల్చర్ అర్థం కావడానికి టైమ్ పడుతుంది. అదే మన హైదరాబాదీ అమ్మాయిలైతే… సీన్ చెప్పగానే అచ్చమైన తెలంగాణ లేదా తెలుగు యాసతో, ప్రాణం పెట్టి నటించేస్తున్నారు. గతంలో మన అమ్మాయిలు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలే నేడు ఈ సక్సెస్‌కు మెట్లుగా మారాయి. ఒకప్పుడు “తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు రావు” అన్న చోటే, ఇప్పుడు “తెలుగు అమ్మాయి లేనిదే సినిమా లేదు” అనే స్థాయికి టాలీవుడ్ మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ సిల్వర్ స్క్రీన్ క్వీన్స్ బాక్సాఫీస్‌ను ఇంకెన్ని ఊపులు ఊపుతారో చూడాలి మరి!
-జి.మహేష్ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455