- లాటరీలో అదృష్టం..ఫీల్డ్‌లో దౌర్భాగ్యం!
- లబ్ధిదారుల ఆశలపై ‘ఇందిరమ్మ’ నీళ్లు
‘ఆశ చూపి గొంతు కోయడం’ అంటే ఇదేనేమో. సొంత గూడు లేక, ఏళ్ల తరబడి అద్దె కొంపల్లో నలిగిపోతున్న పేద, మధ్యతరగతి జనంపై ప్రభుత్వం ఆడుతున్న వికృత నాటకం ఇందిరమ్మ ఎల్ఐజీ స్కీమ్. ‘అందని మాను పండుకు అర్రులు చాచినట్లు’ డ్రాలో పేరు వచ్చిందని సంబరపడేలోపే… ఫీల్డ్ వెరిఫికేషన్ పేరిట నిలువునా ముంచేస్తున్నారు. ఇందిరమ్మ ఎల్ఐజీ (LIG) పథకంతో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు పెట్టుకున్న నమ్మకంపై ప్రభుత్వం నిబంధనల పిడుగులు కురిపిస్తోంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న సామెత చందంగా… లాటరీలో పేరు వచ్చినా, చేతికి ఇల్లు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

వడపోతలపై వడపోతలు..తీరా చూస్తే మొండిచేయి!
ఆరు లక్షలు కడితే ఇల్లు, ఆదాయం ఆరు లక్షల లోపు ఉంటే అర్హులు అని ప్రభుత్వం ఊరూరా టముకు వేసింది. నమ్మిన అమాయక జనం దరఖాస్తు చేసారు. అరవై వేల మంది దరఖాస్తుదారుల్లో తీవ్ర పరిశీలనల అనంతరం నలభై వేల మందిని ఎంపిక చేశారు. ఆపై స్క్రూటినీ చేసి, అర్హుల జాబితా రూపొందించి, పారదర్శకత పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో పేరు రాగానే సొంత గూడు దక్కిందని సంబరపడ్డ సామాన్యుడి ఆశలను ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో తుంచేస్తున్నారు. అన్నీ వడపోసిన తర్వాత లాటరీ తీసినప్పుడు, మళ్లీ ఇప్పుడు కొత్త కొర్రీలు ఎందుకు? ‘తాంబూలాలిచ్చేశాం ఇక తన్నుకు చావండి’ అన్నట్లుగా అధికారుల వ్యవహారశైలి తయారైంది. అన్నీ చూశాకే లాటరీ తీసినప్పుడు, మళ్లీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో అర్హులను పక్కన పెట్టడం పచ్చి దగా కాక మరేమిటి?

అర్థంలేని కొర్రీలు.. అడ్డగోలు నిబంధనలు
హైదరాబాద్ Core Urban Region (CURE)లో నివసించే తక్కువ ఆదాయ కుటుంబాలకు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. CURE పరిధిలో కనీసం 10 సంవత్సరాల నివాసం ఉండాలి. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల పేరుపై ORR/CURE పరిధిలో ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు మాత్రమే. మీరు నివసించే అసెంబ్లీ నియోజకవర్గానికే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కానీ రియాల్టీలో జరుగుతోంది ఏంటి? వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండి, సొంత ఇల్లు లేని వారికి ఈ పథకం వర్తిస్తుందని తొలుత ప్రకటించిన పాలకులు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో వింత పోకడలకు తెరతీశారు. వివాహమై, వేరు కాపురం ఉంటూ, సొంత గూడు లేక అద్దె కొంపల్లో మగ్గుతున్న లబ్ధిదారులను ‘మీ తండ్రికి ఇల్లుంది’ అంటూ అనర్హులుగా తేల్చడం ఏ రకమైన న్యాయం? తండ్రి పేరుతో ఇల్లు ఉన్నా… అందులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేది కూడా చూడాలి. తండ్రికి ఇల్లు ఉండే వారసలకు రావడం సజహం. కానీ ఆ కుటుంబ పరిస్థితి, సభ్యుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ప్రభుత్వ కొర్రీలతో అర్హులు కూడా అనర్హులుగా తెల్చేస్తున్నారు. ఆరు లక్షల వార్షిక ఆదాయం, సొంత ఇల్లు లేనివారికే పథకం అని నిబంధన పెట్టారు. తీరా వేరిఫికేషన్‌లో ‘నీ తండ్రి పేరిట ఇల్లుంది, నీకు రాదు’ అనడం ఏ రకమైన పిచ్చి తుగ్లక్ నిర్ణయం? వివాహమై, వేరుపడి బతుకుతున్న వాడికి తండ్రి ఆస్తి చూపి ఎలా నిరాకరిస్తారు?

ప్రభుత్వం నిర్ణయించిన రూ. 6 లక్షలు చెల్లించడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా, ఇల్లు ఇవ్వకుండా తరిమేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆరు లక్షల రూపాయలు అప్పులు చేసి, చెమటోడ్చి కట్టేందుకు పేదలు సిద్ధంగా ఉన్నా, సాంకేతిక కారణాలు చూపి తిరస్కరించడం దారుణం. ఈ కొర్రీలే పెట్టాలనుకుంటే వేల రూపాయల ఫీజులు, దరఖాస్తులు, లక్కీ డ్రాల పేరిట ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు?. ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి, చివరకు ఆశలు రేపి అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేయడం ప్రజలను వెక్కిరించడమే. స్కీమ్ నిబంధనల్లో ఎక్కడైనా తండ్రికి ఇల్లు ఉంటే కొడుకుకు ఇవ్వమని ఉందా? లబ్ధిదారుడికి ఇల్లు లేదు, ఆరు లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా లేనిపోని రూల్స్ తెచ్చి అర్హులను అనర్హులుగా చేస్తున్నారు. అసలు ప్రభుత్వ లక్ష్యం ఏంటి? పేదవాడికి ఇల్లు ఇవ్వాలా? లేక ఇచ్చిన భరోసాను కూడా లాక్కోవాలా? అన్నది అర్ధం కాని పరిస్థితి.
రాత్రి వేళల్లో తనిఖీలు.. అధికారులకూ తప్పని తిప్పలు
‘చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు’ ఉంది అధికారుల తీరు. రాత్రి పది గంటల సమయంలో తనిఖీలకు వస్తూ అటు లబ్ధిదారులను భయాందోళనలకు గురిచేయడమే కాకుండా, ఇటు ఫీల్డ్ అధికారులు తీవ్రమైన పనిభారంతో సతమతమవుతున్నారు. అసంబద్ధమైన నిబంధనలతో కిందిస్థాయి సిబ్బంది ప్రజల ఆగ్రహానికి బలిపశువులవుతున్నారు. మొత్తంగా చూస్తే ఇందిరమ్మ పథకం పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి తెచ్చారా, లేక ప్రజల ఆశలతో చెలగాటమాడి పథకాన్ని నవ్వులపాలు చేయడానికి తెచ్చారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘చెప్పేవి శ్రీరంగనీతులు… చేసేవి దొంగ పనులు’ అన్న చందంగా మారిన ఈ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. పథకం అమలులో పక్కా ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి తలెత్తింది. ప్రజల ఆశలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది.

ఇంత జరిగాక లాటరీ ఎందుకు? స్క్రూటినీ ఎందుకు? “మొదట్లోనే వద్దంటే సరిపోయేది, ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాక కిందకు తోయడం” లాగా ఉంది ప్రభుత్వ తీరు. 60 వేలలో 40 వేలను ఏరి, అందులో లక్కీ డ్రా తీసి, ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ అంటూ మళ్లీ కోత పెడితే, ఈ స్కీమ్ నవ్వుల పాలు కాక ఏమవుతుంది? “చేతికి వచ్చాక నోటికి అందకుండా చేయడం” అంటే ఇదే. ప్రజల్లో ఇప్పుడు అనుమానం మొదలైంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల స్కీమా? లేక ఇంద్రజాలం స్కీమా? కష్టపడి డబ్బు కట్టడానికి రెడీ అయిన వాడిని, వాళ్ళ తండ్రి పేరుతో అనర్హుడిని చేయడం ఇది స్కీమ్ ని నీరుగార్చడమే. అర్హత ఉన్న పేదలను నిరాశపరిచి రోడ్డున పడేస్తే, పాలకులు ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి, అన్యాయమైన నిబంధనలను సడలించకపోతే పేదల ఆగ్రహజ్వాలల్లో పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘ఇందిరమ్మ స్కీమ్’ కాస్తా ‘ఇందిరమ్మ స్కామ్’గా మిగిలిపోవడం ఖాయం.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్,