పశ్చాత్తాప బాటలో..ఎందుకీ మార్పు?▶️

  • పశ్చాత్తాప బాటలో.. ఎందుకీ మార్పు?

“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటి?” అన్న సామెత తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సరిగ్గ సరిపోతుంది! అధికారంలోకి రాగానే పదవులు, నిధులొస్తాయన్న ఆశతో గులాబీ కండువా మార్చి హస్తం గూటికి చేరిన సీనియర్ ఎమ్మెల్యేలు… ఇప్పుడు తాము ఆశించినవి అందక అటు ఇటు కాకుండా సతమతమవుతున్నారు. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. “మంత్రి పదవి, డబ్బు కోసం కాంగ్రెస్‌లో చేరలేదు.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్మథనాన్ని బయటపెట్టాయి. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోలేనంటూనే, సీఎం రేవంత్‌రెడ్డి తన ఫోన్‌ కూడా ఎత్తడం లేదని, మంత్రులు తన మాట వినడం లేదంటూ పోచారం చేసిన బహిరంగ విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంమైంది. గులాబీ కండువాను పక్కనపెట్టి హస్తం గూటికి చేరిన ఈ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే కాదు బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చాలా మంది ఎమ్మెల్యే మాట కూడా ఇదే. తొందరపడి కాంగ్రెస్‌లో చేరామనే భావన వారిలో వ్యక్తమవుతోంది.

రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం దశాబ్దాలుగా జరుగుతున్న తంతే. పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి ఉద్దండులు దశాబ్దాల రాజకీయ అనుభవంతో అడుగులు వేస్తుంటారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత ప్రభావశీలమైన నేతలుగా, అధికార బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పిన సీనియర్లు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి ఎందుకు సతమతమవుతున్నారు? అన్నది అసలు ప్రశ్న. గులాబీ బాస్ కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్న దశలో, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరూ కారు దిగి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అధికారంలో లేకపోతే నియోజకవర్గానికి నిధులు రావని, పనులు జరగవని, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందనే బలమైన భయం వీరిని కాంగ్రెస్ వైపు నడిపించింది. కొందరిపై ఉన్న రాజకీయ, ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి రక్షణ పొందడమే లక్ష్యంగా అధికార పార్టీలోకి జంప్ చేశారనే ప్రచారం జోరుగా సాగింది.

రాజకీయాల్లో ఎదిగిన తీరును, వెనుక ఉన్న నాయకుడిని విస్మరించి అవకాశవాద రాజకీయాలు చేసిన సీనియర్లు ఇప్పుడు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గానికి ప్రభుత్వ నుంచి నిధులు రావు, కేడర్‌ను కాపాడుకోవడం కష్టం, అభివృద్ధి ఆగిపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే అధికార పార్టీతో సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతోనే వీరు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారనేది స్పష్టమవుతోంది. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ కొన్ని పరిణామాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే హస్తం తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చిందని పోచారం బాహాటంగానే ఒప్పుకోవడం గులాబీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను కాంగ్రెస్ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండా (అభివృద్ధి పేరుతో) మాత్రమే కప్పుకున్నానని ఆయన చెప్పడం చూస్తుంటే… రేపు మళ్లీ రాజకీయ సమీకరణాలు మారితే పాత గూటికి పయనం కావడానికి ఆయన ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేది సుస్పష్టమవుతోంది.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి, ఆ పార్టీ కార్యకర్తలతో పోరాడిన నేతలు… ఇప్పుడు అదే పార్టీలోకి వచ్చి వారి కింద పనిచేయడం, లేదా స్థానిక కాంగ్రెస్ కేడర్ వీరి రాకను జీర్ణించుకోలేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ మారినప్పటికీ క్షేత్రస్థాయిలో పాత వైరుధ్యాలు అలాగే కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన సీనియర్ నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా, గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పరిణామాలు వేరుగా ఉన్నాయి. కీలక పదవి దక్కుతుందని ఆశించిన సీనియర్లకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ లెక్కలు వేరుగా ఉండటంతో, వీరికి కేవలం ‘ఎమ్మెల్యే’ హోదా మినహా పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటం వీరిని నిద్రపోనివ్వడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ప్రతికూల తీర్పు వస్తే శాసనసభ్యత్వమే కోల్పోవాల్సి వస్తుందనే భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. సుప్రీంకోర్టు విచారణ కత్తి వీరి మెడపై వేలాడుతుండటంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకవేళ కోర్టు నుంచి అనర్హత వేటు లాంటి ప్రతికూల తీర్పు వస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన ఈ నేతల్లో స్పష్టంగా ఉంది. అందుకే తాము కేవలం ‘అభివృద్ధి కోసమే’ కలిశామంటూ లీగల్ లేదా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలోనూ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే అంశం వీరిని కలవరపెడుతున్న మాట వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయనే అంచనాలు గులాబీ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెంచుతున్నాయి. పార్టీ మారిన నేతలపై ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కేడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. “ఓట్లు వేసి గెలిపిస్తే స్వలాభం కోసం పార్టీ ఫిరాయించారు” అనే ముద్ర పడటంతో, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమను క్షమించరనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఉండి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే కంటే, మళ్లీ పరిస్థితులు చక్కబడిన తర్వాత లేదా బీఆర్ఎస్ బలపడే సమయంలో సొంత గూటికి లేదా ప్రాంతీయ ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ, రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ బలపడినా లేదా రాజకీయంగా గాలి మారినా, అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా యూ-టర్న్ తీసుకోవడానికి వీలుగా ఈ సీనియర్లు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిన నేతలను స్థానిక కేడర్ నమ్మే స్థితిలో లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించడం ఖాయమనే భయంతోనే ఈ సీనియర్లు మళ్లీ జనాల్లోకి వెళ్లి కవర్ డ్రైవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము పార్టీ మారినప్పటికీ, కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేక, అలా అని కాంగ్రెస్‌ను కాదనలేక… ఇటు అభివృద్ధి, అటు సర్వైవల్ బ్యాలెన్స్ చేయడానికి ఈ తరహా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారనే వాదన బలపడుతోంది.

పఠాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వారు తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం, ఇప్పుడు పోచారం బాహాటంగా రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే… ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా మళ్లీ గులాబీ బాట పట్టేందుకు మునుముందు భారీ రాజకీయ యూ-టర్న్‌లు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవైపు కాంగ్రెస్‌లో ఉంటూ పనులు చేయించుకుంటూనే, మరోవైపు భవిష్యత్తు రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలతోనూ పూర్తిగా సంబంధాలు తెంచుకోకుండా ఈ సీనియర్లు జాగ్రత్త పడుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లేదా ప్రభుత్వంలో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారని భావించినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో హామీలు రాలేదనే చర్చ జరుగుతోంది. పైగా, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ వీరి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ నేతలు ఇరుకున పడ్డారు.

కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ నియోజకవర్గ అభివృద్ధి అనే ఒకే ఒక్క కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే హస్తం గూటికి వెళ్లాల్సి వచ్చిందని పోచారం బాహాటంగానే అంగీకరించారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం అభివృద్ధి అనే జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని ఆయన చెప్పడం ద్వారా… గులాబీ శిబిరంతో తమ బంధం పూర్తిగా తెగిపోలేదనే సంకేతాలను పంపినట్లయింది. తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీ మారిన సీనియర్ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిప్పు మీద నడకలా తయారైంది. అటు కాంగ్రెస్‌లోనూ ఇమడలేక, ఇటు పాత పార్టీని పూర్తిగా వదలలేక సతమతమవుతున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఈ తాజా విస్ఫోటనం.. రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే పెనుమార్పులకు బలమైన సంకేతం అనడంలో ఎలాంటి సందేహం లేదు! పోచారం లాంటి ఉద్దండుల నోట వస్తున్న ఈ అసంతృప్తి స్వరాలు… మాటల అంతరార్థం కేవలం అభివృద్ధి మాత్రమే కాదు… మారుతున్న కాలానికి తగ్గట్టుగా తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే హై-వోల్టేజ్ వ్యూహమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు! రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి!

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455 

ట్రెండింగ్ న్యూస్