గులాబీ బాస్‌కు రేవంత్‌ ‘చెక్’! రేవంత్ చదరంగంలో కేసీఆర్ చిక్కుకున్నారా?

గులాబీ బాస్‌కు రేవంత్‌ ‘చెక్’!

రేవంత్ చదరంగంలో కేసీఆర్ చిక్కుకున్నారా?

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు తెరవెనుక ఆటలు ముగిసి.. ఫేస్‌ టు ఫేస్‌ పవర్ ప్లే మొదలైంది. ఎర్రవల్లి కోట చుట్టూ అలుముకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఒక తీవ్రమైన రాజకీయ బాణం దూసుకొచ్చింది. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ చక్రవ్యూహాన్ని సిద్ధం చేశారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించే సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు.

 

తెలంగాణ రాజకీయ చదరంగంలో ఎప్పుడూ పావులను నడిపించే స్థానంలో ఉండే కేసీఆర్‌ను, ఈసారి రేవంత్ రెడ్డి స్వయంగా డిఫెన్స్‌లోకి నెట్టేలా ఎత్తుగడ వేశారు. ‘పనిచేయని పదవి ఎందుకు? ప్రజాధనం దండగ కాదా?’ అనే ఒక్క ప్రశ్నతో గులాబీ అధినేతను ప్రజా క్షేత్రంలో నైతిక విచారణకు నిలబెట్టే ప్రయత్నం మొదలైంది. ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగుతున్న కేసీఆర్ మౌనంపై రేవంత్ సంధించిన అస్త్రం చాలా పదునైనది. అసెంబ్లీకి రాకుండా, గజ్వేల్ ప్రజల గొంతుకగా నిలవకుండా, రాజ్యాంగం కల్పించిన జీతభత్యాలు, సదుపాయాలు మాత్రం ఎలా తీసుకుంటారంటూ కాంగ్రెస్ శ్రేణులను నేరుగా రోడ్లపైకి దించారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ మొదలైన ఈ నిరసనల వెనుక ఉన్నది కేవలం ఒక ఉప ఎన్నిక కాంక్ష కాదు, అంతకుమించిన దీర్ఘకాలిక మానసిక యుద్ధం. కేసీఆర్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించిన ఈ సరికొత్త రాజకీయ అస్త్రాన్ని కేవలం శాసనసభాపక్ష రాజకీయాలకే పరిమితమైన విమర్శ కాదు, ప్రత్యర్థిని నైతికంగా బోనులో నిలబెట్టే పక్కా క్షేత్రస్థాయి వ్యూహం. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులను క్షేత్రస్థాయి నిరసనలకు పురిగొల్పడం సాధారణ ఎత్తుగడ కాదు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇమేజ్‌ను నేరుగా సామాన్య పౌరుడి ఆలోచనల్లోకి తీసుకెళ్లి విచారణకు పెట్టే తీవ్ర ప్రయత్నం.

కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక కాంగ్రెస్ వేస్తున్న దీర్ఘకాలిక రాజకీయ స్కెచ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు స్కెచ్ భవిష్యత్తు ఎన్నికలే. రేపు ఎన్నికల వేళ కేసీఆర్ మైకులు పట్టుకుని ప్రజల్లోకి వస్తే, “ఐదేళ్లు గడీ దాటని నేత.. మళ్లీ అధికారం కోసమే రోడ్డుపైకి వచ్చారు” అనే ఒక చెరగని ముద్రను ప్రజల గుండెల్లో బలంగా నాటడమే రేవంత్ లక్ష్యం. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, కేవలం ఎన్నికల ఏడాదిలోనే కేసీఆర్ జనం ముందుకు వస్తే.. “ఓట్లు, పదవుల కోసమే గడీ దాటారు” అనే ముద్రను ప్రజల్లో ముందే నాటేయడం రేవంత్ వ్యూహం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సభా వేదికపైనే పాలకపక్షం ఆయనను నేరుగా ఢీకొట్టగలదు. రాని పక్షంలో “బాధ్యతారాహిత్యం” పేరిట నియోజకవర్గాల్లో ప్రచారం చేయవచ్చు. ఏ రకంగా చూసినా గులాబీ దళాన్ని డిఫెన్స్‌లోనే ఉంచేలా ఈ చదరంగం పావులు కదులుతున్నాయి. అసెంబ్లీకి వస్తే నేరుగా సభలోనే ముఖాముఖి ఎదుర్కోవచ్చు, రాకపోతే ‘బాధ్యతలేని విపక్ష నేత’గా ప్రజాక్షేత్రంలో కట్టడి చేయవచ్చు. ఇది కేసీఆర్ చుట్టూ రేవంత్ అల్లుతున్న ఒక క్లిష్టమైన చక్రవ్యూహం. అయితే, తెలంగాణ రాజకీయాల్లో తుఫానుకు ముందు ప్రశాంతతను సృష్టించడంలో కేసీఆర్ దిట్ట. ప్రత్యర్థి సంధించిన ఈ రాజీనామా అస్త్రాన్ని గులాబీ బాస్ తేలికపాటి రాజకీయ విమర్శగా కొట్టిపారేస్తారా, లేక ఊహించని సమయంలో ప్రజాక్షేత్రంలోకి దూసుకొచ్చి తిరుగులేని ప్రతిదాడి చేస్తారా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో ఎదురుదెబ్బలను సైతం సరికొత్త ఉద్యమాలకు మలుచుకున్న చరిత్ర కేసీఆర్‌ది. తుఫానుకు ముందు ప్రశాంతతను సృష్టించడంలో కేసీఆర్ దిట్ట. రేవంత్ విసిరిన ఈ సవాలును ఆయన తేలిగ్గా కొట్టిపారేస్తారా? లేక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరే వరకు వేచి చూసి, ఊహించని సమయంలో ప్రజాక్షేత్రంలోకి దూసుకొచ్చి ప్రతిదాడి చేస్తారా? అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తెలంగాణ ఉద్యమం మొదలుకొని దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కేసీఆర్, ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడు మౌనంగా ఉంటారో, ఎప్పుడు తుఫానులా విరుచుకుపడతారో అంచనా వేయడం ప్రత్యర్థులకు కూడా కష్టమే. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలు, ప్రజా సమస్యలు తీవ్రరూపం దాల్చే కీలక సమయం కోసమే ఆయన వేచి చూస్తున్నారన్నది గులాబీ నేతల వాదన. మౌనంగా ఉంటే బాధ్యతారాహిత్యం అనే ముద్ర.. స్పందిస్తే ప్రత్యర్థి నిర్దేశించిన పిచ్‌పై ఆడాల్సి రావడం. ఈ క్లిష్టమైన రాజకీయ ఉచ్చు నుంచి కేసీఆర్ ఎలా బయటపడతారన్నదే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత బిగ్ క్వశ్చన్. మొత్తం మీద రేవంత్ మొదలు పెట్టిన ఈ సరికొత్త రాజకీయ క్రీడలో కేసీఆర్ ఆట ఎలా ఉంటుందని అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్