రవీంద్ర సూరికి సినారె సాహితీ పురస్కారం

  • రవీంద్ర సూరికి సినారె సాహితీ పురస్కారం
    ఎంపిక చేసిన ‘తెలంగాణ సాహిత్య అకాడమీ, మహాకవి సినారె కళా పీఠం’
     వచ్చే నెల 2న సురవరం ప్రతాప రెడ్డి తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో ప్రదానం

త్రికాల తెలుగు : హైదరాబాద్‌ ప్రతినిధి (జూలై 25): ప్రతి యేటా సాహితీవేత్తలకు ఇచ్చే సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) సాహితీ పురస్కారం ఈ యేడు ప్రముఖ రచయిత, కవి, నటులు, సినీ దర్శకులు నామాల రవీంద్ర సూరిని వరించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ‘మహాకవి సినారె కళా పీఠం’ హైదరాబాద్‌ వారు ప్రతి సంవత్సరం పలువురు ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలను అందజేస్తుంది. అయితే, పద్మ భూషణ్‌, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి 95వ జయంతిని పురస్కరించుకొని ఈ యేడాది 2026కు గాను ‘సినారె సాహిత్య పురస్కారాలు’ను ఆగస్టు 2న ప్రదానం చేస్తుంది. ఈ పురస్కారాలకు గాను తెలుగు సాహిత్యంలోని పదకొండు మంది సాహితీ ధురంధరులను ‘మహాకవి సినారె కళా పీఠం’ ఎంపిక చేసుకుంది. అందులో నామాల రవీంద్ర సూరి ఒకరుగా నిలవటం చెప్పుకోదగిన విషయం. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో మాస్టర్స్‌ చేసిన రవీంద్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి జానపద సాహిత్యంలో ఎం. ఫిల్‌ చేశారు. అంతకు ముందు తెలుగు పండితుడిగాను శిక్షణ పొంది కొన్నాళ్లు ఆ వృత్తిలో కొనసాగారు. రచనలు, కవిత్వం, సినిమా నేపథ్యంపై మక్కువతో అధ్యాపక వృత్తిలో కొనసాగలేకపోయారు. ఆయన రాసిన ”అనాహత’, ‘రణన్నినాదం నా తెలంగాణ” లాంటి గ్రంథాలు ఎంతో మందిని ఆకట్టుకొని ఆలోచింపజేసినవి. కాల్పనిక రచనలు, సినిమా నేపథ్యంలో పెక్కు ఆర్టికల్స్‌ రాశారు. అంతే కాకుండా తెలుగు సినిమా దర్శకులలో శతాధిక చిత్రాలు తీసిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు లాంటి వారిని రవీంద్ర రాసిన ఎన్నో ఆర్టికల్స్‌ చదివింపజేశాయి. ఆయనతో సంభాషించేలా చేశాయి. రవీంద్ర రచనలు రసాత్మకమైనవి. సంస్కృత అలంకారికుడు విశ్వనాథుడు ”సాహిత్య దర్పణం”లో ”వాక్యం రసాత్మకం.. కావ్యం”గా చెప్పినట్టు రవీంద్ర ధోరణి కూడా అలాంటిదే. స్వాతి, ఆంధ్రభూమి లాంటి వార, మాస పత్రికలలో కథలు, సీరియల్స్‌ కొన్ని నెలలుగా ప్రచురించబడ్డాయి. ఆయన రచనలలో నైతిక విలువలు గల రచనలు అనేకం ఉన్నాయి. హాస్యం, శృంగార తరహా కాల్పనిక కథలు, కథనాలూ ఉన్నాయి. కవిత్వమే ప్రధానమై ఆయనను నేడు సినారె పురస్కారానికి చేరువు చేసింది. వందలాది కవితలు, కవితా సంపుటిలు వెలువరించారు. మహాకవి సినారె చేతుల మీదుగా రవీంద్ర ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం, ఆ మహాకవి పురస్కారానికే ఎంపిక కావడం విశేషం. ఇటీవల ఖతార్‌లో కళా రంగానికి జరిగిన సత్కారాలలో రవీంద్ర కవితా గోష్టిలో కలం బలం చూపించి పురస్కారం అందుకున్నారు. ఇలా ఆయన ఖాతాలో ఎన్నో పురస్కారాలు, అవార్డులు చేరిపోయాయి. రవీంద్ర సూరి సూర్యాపేట (ఉమ్మడి నల్లగొండ) జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వారు. రవీంద్ర ఒక సినిమాకు దర్శకునిగా, నాలుగు చిత్రాలకు కథా సహకారం, మాటల రచయితగా, ఇంకా గేయ రచయితగా కొనసాగారు. కొంత కాలం ప్రముఖ సృజన శీలి, హాస్య రచయిత, నటుడు ఎల్బీ శ్రీరాం వద్ద శిష్యరికం చేశారు. మహాకవి సినారె 95వ జయంతిని పురస్కరించుకొని సినారె కళాపీఠం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేసిన కమిటీ సభ్యులు పోరెడ్డి రంగయ్యకు, సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములుకు రవీంద్ర సూరి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా సాహిత్యానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్రెండింగ్ న్యూస్