311 ఏళ్ల లడ్డూ వైభవం.. శ్రీవారి దివ్య ప్రసాదం

భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి. ఆ దివ్యక్షేత్రానికి వెళ్లిన ప్రతి భక్తుడి మనసులో స్వామివారి దర్శనంతో పాటు మెదిలే మరో అద్భుతమైన పేరు… “శ్రీవారి లడ్డూ”. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం.. భక్తుల కొంగుబంగారం అయిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రస్థానానికి అపురూపమైన చరిత్ర ఉంది. ఆ నాటి నుంచి నేటి వరకు భక్తుల నాల్కలపై తిరుగుతూ, మదిలో నిలిచిపోయిన ఈ దివ్య ప్రసాదం. సుమారు 311 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన అద్భుతమైన ప్రసాదం ఇది.

శ్రీవారి దివ్యక్షేత్రం అనగానే ముందుగా గుర్తువచ్చేది ఆ శేషాచల హిల్స్, అటుపై గోవింద నామస్మరణ.. ఆ వెంటనే మన నోట్లో నానుతూ మనసును పులకించజేసే అమృత భావన ‘తిరుమల లడ్డూ’. దర్శనం ఎంత ముఖ్యమో, ప్రసాదంగా లభించే ఆ లడ్డూ అంతకంటే పవిత్రం. అటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సరిగ్గా 311 వసంతాల ఘనమైన చరిత్రను పూర్తి చేసుకుంది. నాటి రాజసం నుంచి నేటి ఆధునిక హంగుల వరకు ఆ లడ్డూ ప్రయాణం కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి అధికారికంగా అంకురార్పణ జరిగింది సెప్టెంబర్ 30, 1715 సంవత్సరంలో. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రసాదం తన విశిష్టతను కోల్పోకపోగా, దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ఖ్యాతిని గడించింది. లడ్డూ ప్రవేశపెట్టడానికి ముందు శ్రీవారికి ‘మనోహరం’ అనే పిండివంటను నైవేద్యంగా సమర్పించేవారు. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ, ఎక్కువ రోజులు నిల్వ ఉండే, అందరికీ సులభంగా పంచగలిగే పవిత్ర ప్రసాదం అవసరం ఏర్పడింది. అలా పుట్టిందే నేటి మన తిరుమల లడ్డూ!

లడ్డూలను తయారు చేసే వంటశాలను తిరుమలలో ‘పోటు’ అని పిలుస్తారు. ఇక్కడ లడ్డూల తయారీ అనేది కేవలం వంట కాదు… అది ఒక భక్తి ప్రక్రియ, నిరంతర యజ్ఞం. వేలాది మంది భక్తుల కోసం పోటు కార్మికులు ఎంతో నిష్టతో, మంత్రోచ్ఛారణల నడుమ ఈ లడ్డూలను తయారు చేస్తారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, శెనగపిండి, నాణ్యమైన పంచదార, కిస్‌మిస్, జీడిపప్పు, యాలకులు… ఇవన్నీ కలిపి చేసే లడ్డూ ఇస్తూ ఉంటే వచ్చే పరిమళమే వేరు. ఆ సువాసన చూస్తేనే మనసు పులకించిపోతుంది. పూర్వం మనుషుల చేతులతోనే తయారు చేసేవారు. భక్తుల డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రస్తుతం పోటులో పంచదార, శెనగపిండి, నెయ్యిని కలపడానికి ఆధునిక కన్వేయర్లు, మిక్సర్లు ఉపయోగిస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రధానంగా మూడు రకాలుగా లభిస్తుంది. దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఇచ్చేది. శ్రీవారి దర్శనానంతరం ప్రతి భక్తుడి చేతికి అందే అమృతం. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అందించే ప్రత్యేక లడ్డూ. అతిపెద్ద సైజులో ఉండే ఈ లడ్డూను కేవలం ప్రత్యేక ఉత్సవాలు, వీఐపీల కోసం అత్యంత ప్రత్యేకం తయారు చేస్తారు. దీనిలో నెయ్యి, డ్రైఫ్రూట్స్ మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా భౌగోళిక గుర్తింపు పొందిన ఏకైక ప్రసాదం తిరుమల లడ్డూ. ఏ దేశం వెళ్లినా, ఏ మూలన ఉన్నా తిరుమల నుంచి వచ్చే బంధువుల కోసం, మిత్రుల కోసం ఎదురుచూసే తపన ఒక్క లడ్డూ ప్రసాదం చుట్టూనే తిరుగుతుంది. ఇంటికి లడ్డూ రాగానే… దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ భక్తులు కళ్లకు అద్దుకునే ఆ క్షణం కోటి జన్మల పుణ్యంగా భావిస్తారు. ఆ లడ్డూ ముక్క నోట్లో వేసుకోగానే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. 311 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో తరాలు మారాయి, పాలనా విధానాలు మారాయి, టెక్నాలజీ వచ్చింది. కానీ శ్రీవారి లడ్డూ పట్ల భక్తుల భక్తి, ఆ ప్రసాదం ఇచ్చే మధురమైన అనుభూతి మాత్రం అణణుమాత్రం కూడా తగ్గలేదు. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యంగా భావిస్తారో, తిరుగు ప్రయాణంలో “శ్రీవారి లడ్డూ ప్రసాదం” తేవడం అంతే పవిత్రంగా భావిస్తారు. ఈ లడ్డూను కేవలం ఒక తినుబండారంగా కాక, సాక్షాత్ శ్రీవారి ప్రసాదంగా, స్వామివారే స్వయంగా తమ ఇంటికి వచ్చినట్లు భక్తులు భావిస్తారు.

కోట్లాది మంది భక్తుల ఆకలిని తీరుస్తూ, ఆధ్యాత్మిక మధురిమలను పంచుతున్న తిరుమల లడ్డూ చరిత్ర కేవలం ఒక వంటకం కాదు.. అది భారతీయ సనాతన సంస్కృతి, భక్తి భావాల సమ్మేళనం. తరాలు మారుతున్నా, కాలం మారుతున్నా శ్రీవారి లడ్డూ రుచి, దానిపై భక్తుల నమ్మకం ఏమాత్రం తగ్గలేదు.. భవిష్యత్తులోనూ తగ్గదు కూడా! కలియుగం ఉన్నంత కాలం, శ్రీవేంకటేశ్వర స్వామి నామస్మరణ ఉన్నంత కాలం… ఈ లడ్డూ దివ్య పరిమళాలు భక్తుల నాల్కలపై, మనసులపై చిరస్థాయిగా నిలిచిపోతూనే ఉంటాయి. కేవలం ఒక పిండివంటో, ప్రసాదమో కాదు… కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి ఆశీర్వాదం.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455 

ట్రెండింగ్ న్యూస్