- TG రాజకీయాల్లో భూముల లొల్లి
- నోటికొచ్చినట్లు మాట్లాడటం !
- గద్దెనెక్కాక నాలుక కరుచుకోవడం !
నోటికొచ్చినట్లు మాట్లాడటం.. తీరా గద్దెనెక్కాక అసెంబ్లీ సాక్షిగా నాలుక కరుచుకోవడం! తెలంగాణ రాజకీయాల్లో భూముల లొల్లి చూస్తుంటే అచ్చం ఇట్లే ఉంది. ఒకప్పుడు ఈ ‘వెయ్యి ఎకరాల’ ముచ్చట రాష్ట్రంలో పెద్ద బాంబులా పేలింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ వెయ్యి ఎకరాల భూమి ఉందని, పేదల భూములను మింగేశారని అప్పట్లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మైకులు పగలగొట్టి మరీ ఆరోపణలు చేసిండ్రు. తీరా అధికారం చేతికొచ్చాక, అసెంబ్లీ రికార్డుల సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రే చదివిన లెక్క మాత్రం.. కేవలం 67 ఎకరాలు!

వెయ్యి ఎకరాలెక్కడ.. 67 ఎకరాలెక్కడ? మధ్యలో గల్లంతైన ఆ 933 ఎకరాల ముచ్చటేంది?. అసెంబ్లీలో తేల్చిన 67.13 ఎకరాలు కేసీఆర్, ఆయన సతీమణి పేర్ల మీద ఉన్న చట్టబద్ధమైన వ్యవసాయ భూమి. ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా చూపించిన బహిరంగ సమాచారమే. మరి నాడు మైకుల్లో ఊదరగొట్టిన వెయ్యి ఎకరాల లెక్క కేవలం ఎన్నికల లబ్ధి కోసం ఆడిన రాజకీయ డ్రామానా? ప్రజలు ఇప్పుడు ఏ లెక్కను నమ్మాలె?.
యావత్ రెవెన్యూ యంత్రాంగం, ఉపగ్రహ సర్వేలు, ఫైళ్లు అన్నీ జల్లెడ పట్టి చివరకు తేల్చింది పదుల ఎకరాలేనని ఒప్పుకున్నట్లయింది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయినట్లుగా ఈ వ్యవహారం తయారైంది. ఆధునిక సాగు పద్ధతులతో వ్యవసాయ ప్రయోగశాలగా నడుస్తున్న ఫామ్‌హౌస్‌పై లేని బూచిని సృష్టించారని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ విశ్వసనీయతకే దెబ్బని స్పష్టంగా తెలుస్తోంది.

సెక్షన్ 22A నిషేధిత భూముల వివాదంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సెగ నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ భూముల పంచాయతీని మళ్లీ తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఫామ్‌హౌస్ చుట్టుపక్కల భూములపై 30 రోజుల్లో విచారణకు ఆదేశించినా, రికార్డుల్లో పట్టా భూమిగా ఉన్నవాటిపై న్యాయస్థానాల్లో నిలబడటం కష్టమే. పైగా ప్రస్తుత మంత్రులు, సీఎం బంధువుల భూ కొనుగోళ్లపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలంటూ విపక్షం గట్టిగానే నిలదీస్తోంది. ఎన్నికల ముందు ఆరోపణలు చేయడం వేరు, అధికారంలోకి వచ్చాక పాలనాపరమైన లెక్కలు నిరూపించడం వేరు. నిరాధారమైన ప్రచారాలతో బురదజల్లడం కాకుండా, మిగిలిన 933 ఎకరాల వెనుక అసలు నిజాలుంటే ప్రభుత్వం నిరూపించాల్సి ఉంటుంది; లేకపోతే ప్రజల ముందు నిజాలు తేలిపోవడం ఖాయం.

కేసీఆర్ ఫామ్‌హౌస్ అనేది వ్యవసాయ ప్రయోగశాలగా, ఆధునిక సాగు పద్ధతులతో పంటలు పండించే వేదికగా ప్రజలకు తెలుసు. లేని వెయ్యి ఎకరాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకున్న వారికి, చివరకు రికార్డుల్లో 67 ఎకరాలే తేలడం పెద్ద ఎదురుదెబ్బ. రాజకీయాల్లో ఎన్నికల ముందు చేసే ఆరోపణలు ఒకలా ఉంటే, అధికారంలోకి వచ్చాక శాసనసభ సాక్షిగా మాట్లాడే పాలనాపరమైన లెక్కలు మరోలా ఉంటాయి. గతంలో చెప్పిన 1000 ఎకరాల లెక్క కేవలం రాజకీయ దూకుడేనా, లేక మిగిలిన భూముల వెనుక ఇతర బినామీ నెట్వర్క్ ఏదైనా ఉందా అన్నది ప్రభుత్వం నిరూపించాల్సిన బాధ్యత. అదే సమయంలో, ప్రభుత్వం చెబుతున్న ఆరోపణలను చట్టబద్ధంగా తిప్పికొట్టి తన విశ్వసనీయతను నిలుపుకోవాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. అంతిమంగా ప్రజాక్షేత్రంలో ఎవరు వాస్తవాలు మాట్లాడారు, ఎవరు రాజకీయ రంగు పులిమారన్నది రానున్న రోజుల్లో వెలువడే న్యాయపరమైన, విచారణాత్మక నివేదికల ఆధారంగానే ప్రజలు నిర్ణయించనున్నారు.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్