ఉత్తరాంధ్ర ఆకాశంలో సరికొత్త చరిత్ర టేకాఫ్ అవుతోంది. దశాబ్దాల తరబడి కలల సాకారంగా ఎదురుచూసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. కానీ, విమానం గాల్లోకి లేవకముందే…రాజకీయ నాయకుల మాటల తూటాలు మాత్రం గ్రౌండ్‌లో పేలుతున్నాయి! శంకుస్థాపన నాది..అనుమతులు నావి.. నిర్మాణం నా హయాంలోనే వేగవంతమైందంటూ ప్రతి పార్టీ క్రెడిట్ కోసం పోటీపడుతోంది. ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తీసుకునే లోపే, పొలిటికల్ పార్టీలు క్రెడిట్ పాస్ కోసం చేస్తున్న హడావీడి అంతా ఇంతా కాదు.

ఉత్తరాంధ్ర కలల గూడు… భోగాపురం భవిష్యత్ రన్‌వే టేకాఫ్‌కు సిద్ధమైంది! ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ‘క్రెడిట్ వార్’కి హాట్ కేక్‌గా మారింది. శంకుస్థాపన ఒకరిది..అనుమతులు ఇంకొకరివి..నిర్మాణం వేరొకరి హయాంలో వేగవంతం..మరి అసలు ఈ విమానాశ్రయ అసలు సిసలు వారసుడు ఎవరు? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) చుట్టూ జరుగుతున్న క్రెడిట్ రాజకీయం వేడెక్కుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం వేళ.. రాజకీయ పార్టీల మధ్య ‘నేనంటే నేను’ అనే క్రెడిట్ వార్ తారాస్థాయికి చేరింది.

భోగాపురం ప్రాజెక్ట్ అనేది ఒక పొలిటికల్ రిలే రేస్ లాంటిది. ఇందులో ఒక్కో పార్టీ ఒక్కో ల్యాప్‌ను పరుగెత్తింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలోనే దీనికి రూపకల్పన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ చేయడం, 2019 ఫిబ్రవరిలో స్వయంగా చంద్రబాబు శంకుస్థాపన చేయడంతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని తెలుగుదేశం పార్టీ గట్టిగా వాదిస్తోంది. తమ విజన్ వల్లే ఇదంతా సాధ్యమైందని అంటూ చెబుతోంది. నేనే విత్తనం వేశాను అంటుంది టీడీపీ. 2014-19 మధ్య ఎడారి లాంటి భూములను సేకరించి, బ్లూప్రింట్ సిద్ధం చేసి, 2019లో శంకుస్థాపన రాయి వేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఆలోచనే పుట్టేది కాదనేది వారి లాజిక్.
అయితే మేమే చెట్టును పెంచాం అంటుంది వైసీపీ. అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ (GMR) సంస్థతో ఒప్పందాలు కొలిక్కి తెచ్చి, వివాదాలు పరిష్కరించి, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేబినెట్ తీర్మానం చేసి, పనులకు అడ్డంకులు తొలగించింది తామేనని వారి వాదన. 2019ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా దీనికి సంబంధించిన అనుమతులు, జీఎంఆర్ (GMR) సంస్థతో ఒప్పందాలు, ప్రాజెక్ట్‌కి అవసరమైన క్లియరెన్సులు వేగంగా ముందుకు వెళ్లాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పునాది రాళ్లు కదిలించిందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అంతేకాదు, ఈ ఎయిర్‌పోర్ట్‌కు మన్ధుల వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరు పెట్టాలనే నిర్ణయం తమ కేబినెట్ హయాంలో తీసుకున్నదేనని గుర్తు చేస్తున్నారు.

2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కేవలం 31 నెలల రికార్డు సమయంలోనే పనులను పూర్తి చేయించి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో ఆగస్టు 1న అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయిస్తున్నారు. దీనివల్ల కేంద్రం సహకారం, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల వల్లే ఇది రికార్డు టైమ్‌లో పూర్తయిందనే క్రెడిట్ బీజేపీ, టీడీపీలు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. గత ఐదేళ్లలో నత్తనడకన సాగిన పనులకు పవర్‌నింజెక్షన్ ఇచ్చి, రికార్డు టైమ్‌లో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి తీసుకువచ్చిన క్రెడిట్ తమదేనని గట్టిగా చెబుతున్నాయి కూటమి పార్టీలు.

ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే… ఇటు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, అటు నిర్మాణ పనులను ప్రోత్సహించిన గత ప్రభుత్వం, ఇటు రికార్డు స్థాయిలో గడువు కంటే ముందే పూర్తి చేసిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం, వీరిలో ఎవరిది అసలు విజయం? రాజకీయ నాయకులు ఎవరికి వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ, తామే అసలు సిసలు శిల్పులని చెప్పుకోవచ్చు.

ఉత్తరాంధ్రలో రాజకీయ పట్టు కోసం ఏ పార్టీ కూడా ఈ క్రెడిట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదా ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చాలని చూస్తున్న తరుణంలో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు…అది ఉత్తరాంధ్ర ఎకానమీకి ఆక్సిజన్ సిలిండర్. ఎవరు అధికారంలో ఉన్నా గ్లోబల్ ఇన్వెస్టర్లు వైజాగ్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం కచ్చితంగా ఉండాలి. అందుకే, రేపు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే మొదటి ఫ్లైట్ చక్రాల కింద..ఈ మూడూ పార్టీల రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. కానీ, ఈ క్రెడిట్ వార్ రాజకీయాలకు అతీతంగా.. ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి, ఉపాధి అవకాశాలకు, పర్యాటక రంగానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక ‘గేమ్ ఛేంజర్’ కాబోతుందన్నది మాత్రం అక్షర సత్యం. క్రెడిట్ ఎవరికైనా దక్కనీయండి.. లాభం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల ప్రగతికి దక్కాలన్నదే ప్రతీ ఒక్కరి ఆశ.

రాజకీయ నాయకుల డైలాగులు ఎలా ఉన్నా, ఫ్లెక్సీల యుద్ధం ఏ స్థాయిలో సాగినా..ఒక చారిత్రక సత్యం మాత్రం మరువకూడదు. శంకుస్థాపన చేసిన చేతులు వేరైనా, అనుమతులు ఇచ్చిన సంతకాలు వేరైనా, రిబ్బన్ కట్ చేస్తున్న నాయకులు వేరైనా.. ఈ ఎయిర్‌పోర్ట్ మాత్రం ఉత్తరాంధ్ర యువతకు వేల ఉద్యోగాలను, పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్‌ను పరుస్తుంది. అందుకే, క్రెడిట్ ఎవరి ఖాతాలో పడితే ఏంటి? మైండ్ గేమ్‌లు ఏ పార్టీ ఆడితే ఏంటి? భోగాపురం రన్‌వే మీద నుంచి దూసుకెళ్లే విమానం రెక్కల కింద ప్రగతి రెక్కలు రావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. పొలిటికల్ క్రెడిట్ వార్స్ పర్మినెంట్ కాదు.. కానీ ఈ ఎయిర్‌పోర్ట్ తెచ్చే అభివృద్ధే పర్మినెంట్!