
త్రి.విశ్లేషణ : తెలంగాణ రాజకీయాల్లో ‘మల్లారెడ్డి’ ఒక విలక్షణమైన బ్రాండ్. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక ప్రత్యేకమైన ఫినామినా. ఆయనను చాలామంది కేవలం కామెడీగా మాట్లాడే నాయకుడిగా చూస్తారు, కానీ ఆయన వెనుక ఉన్న పక్కా బిజినెస్ మైండ్, పొలిటికల్ కాలిక్యులేషన్స్ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆయన మాట్లాడే విధానం, హావభావాలు ప్రజల్లో ఎంతగా నవ్వులు పూయిస్తాయో… ఆయన రాజకీయ వ్యూహాలు అంతే పక్కాగా, వ్యాపార కోణంలో ఉంటాయి. మల్లారెడ్డి రాజకీయ అడుగులపై తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్, కేటీఆర్ భజనలో ముందున్న మల్లారెడ్డి… అధికారం కోల్పోయాక సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులతో టచ్‌లో ఉండడంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం మొదలైది. ఈ ప్రచారాన్ని ఆయన ఖడించకపోవడంతో పార్టీ మార్పు నిజమని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయంగా ఆయన కొంత సైలెంట్‌గానే ఉన్నారు. ఎప్పుడు రాజకియ ప్రత్యర్థులపై తనదైన శైలిలో పంచ్‌లు వేసే మల్లారెడ్డి సైలెన్స్ వెనుక మతలబ్ ఏంటి ? అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాజకీయంగా ఫైర్ బ్రాండ్ పేరు తెచ్చుకున్న మల్లారెడ్డి సైలెంట్‌గా ఉండడం అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా ఇబ్బందిగా మారింది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి.. కొద్ది రోజుల క్రితం ఘట్కేసర్లో సీఎం రేవంత్‌రెడ్డి సభకు హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు.. సభలో రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. సభ ముగిసిన తర్వాతనైనా, కనీసం మరుసటి రోజైనా రేవంత్ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. సీఎం విమర్శలపై స్పందించలేదని మల్లారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్లా? లేనట్లా? అన్న చర్చ మొదలైంది. ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలన్నా, నిధులు రావాలన్నా అధికార పార్టీ మద్దతు అవసరం. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. పైగా ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన ముఖ్యమంత్రిని, ఇతర కీలక మంత్రులను కలవడం పెద్ద సంచలనమైంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో, అధికార పార్టీతో ఘర్షణ వైఖరి కంటే… కాస్త సానుకూల వైఖరితో ఉండటమే సేఫ్ అనే భావనలో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతారా లేదా అనేదానిపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన పార్టీ మారితే బీజేపీలో చేరుతారా ? లేక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. గతంలో మల్లారెడ్డి టిడిపి తరపున ఎంపీగా గెలిచినప్పుడు ఆయనకు ఢిల్లీ స్థాయిలో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తెలంగాణలో కూడా ఆ పార్టీ పుంజుకోవడంతో… భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ వైపు చూసే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత దక్కించుకున్న మల్లారెడ్డి, ప్రస్తుతం ఆ పార్టీలో ఇరుకున పడ్డట్లు భావిస్తున్నారు. మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం గమనిస్తే… టిడిపిలో ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అంటే ఆయనకు అధికారంలో ఉండి పనులు చేయించుకోవడమే అలవాటు. ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసే ఓపిక, ఆసక్తి ఆయనకు లేవు. తనతో పాటు తన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , కొడుకు భద్రారెడ్డిల రాజకీయ భవిష్యత్తు ఆయనకు ముఖ్యం. బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్న వేళ, తమ ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్ సేఫ్‌గా ఉండాలంటే పార్టీ మారడమే కరెక్ట్ అనే భావనలో మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి గతంతో తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలిసారు. తనవిద్యాసంస్థల వ్యాప్తిలో భాగంగానే ప్రధానిని కలిసినట్టు చెప్పుకొచ్చినా.. బీజేపీలో చేరడానికే మోదీని కలిశారని బీఆర్ఎస్లోని ఓ వర్గం నమ్ముతోంది. వ్యాపార సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరింపజేసేందుకు బీజేపీ ప్రభుత్వం మద్దతు కోసం మల్లారెడ్డి యత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనను తమ పార్టీలో తీసుకురావాలని భావించిన కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ స్థాయిలో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించారన్న ప్రచారం కూడా జరుగుతోంది..
మల్లారెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక పెద్ద విద్యాసంస్థల అధినేత , వ్యాపారవేత్త. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఆయనకుంది. రాజకీయాల్లో ఆయన శైలి ఎప్పుడూ ప్రత్యేకం. అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటూ, తన నియోజకవర్గ ప్రయోజనాలతో పాటు తన విద్యాసంస్థలు, వ్యాపార సామ్రాజ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఆయన వ్యూహంగా కనిపిస్తుంటుంది. భారీ విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సజావుగా సాగాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం అత్యంత అవసరం. ప్రభుత్వాలు తలుచుకుంటే విచారణలు, భూముల వివాదాలు, పర్మిషన్ల రద్దు వంటి చర్యలతో ఇబ్బందులు పెట్టవచ్చు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మల్లారెడ్డి కాలేజీలపై, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆస్తులపై కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయి. ఆ సమయంలోనే మల్లారెడ్డి రూట్ మార్చారు. సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర మంత్రులను కలవడం వెనుక తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునే డిఫెన్సివ్ స్ట్రాటజీ ఉందనేది ఓపెన్ సీక్రెట్. మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సహచరులు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు. పైగా ఇద్దరూ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిధ్యం వహించినవారే. వ్యక్తిగతంగా ఎంత విమర్శించుకున్నా, పొలిటికల్ అవసరాల కోసం రేవంత్ రెడ్డితో రాయబారాలు నడపడం మల్లారెడ్డికి పెద్ద కష్టమేమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గ నిధులు వస్తాయి, వ్యాపారాలకు రక్షణ ఉంటుంది. అయితే, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాల్లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వంటి నేతలు మల్లారెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్లారెడ్డి వస్తే తమ పట్టు పోతుందని స్థానిక కాంగ్రెస్ క్యాడర్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతానికి మల్లారెడ్డి వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం భవిష్యత్తు రాజకీయ అడుగులపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలు మారినప్పుడు… తన వ్యాపారాలు, రాజకీయ భవిష్యత్తుకు ఏది సురక్షితమో ఆ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి వస్తే.. మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లోని స్థానిక కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి చేరికను ఏ మేరకు స్వాగతిస్తారు అనేది కూడా పెద్ద ప్రశ్నే. మల్లారెడ్డి కేవలం కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఆయనకు బీజేపీ రూపంలో ఒక ప్లాన్-బి కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర సంస్థలై ఈడీ, ఐటీల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి బీజేపీ సేఫ్ జోన్. పైగా తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. గతంలో మల్లారెడ్డి ఇళ్లపై, కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉంటేనే తన సామ్రాజ్యం సేఫ్‌గా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు స్థానిక నేతలు అడ్డుపడితే… ఆయన నేరుగా బీజేపీ కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికైతే మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఎక్కువ కాలం కొనసాగే మూడ్‌లో లేరనేది నగ్నసత్యం. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా పెద్ద పీట వేశారు. నేరుగా కేసీఆర్‌ను ఎదిరించి వెళ్లడం కంటే… పరిస్థితులే నన్ను పార్టీ మారేలా చేశాయి అని చెప్పుకునే ఒక బలమైన సాకు కోసం ఆయన వెతుకుతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి రేవంత్ రెడ్డి-మల్లారెడ్డి బంధమే నిదర్శనం. చంద్రబాబు నాయుడు హయాంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరూ తెలంగాణ టీడీపీలో కీలక నేతలుగా ఉండేవారు. అయితే, మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా… మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు రాజకీయాలు కొద్ది రోజులపాటు నడిచాయి. రాజకీయంగా త్రీవమైన విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డితో ఖయ్యం కంటే దోస్తీనే మేలు అన్న ఆలోచనలో ఉన్నారట మల్లారెడ్డి. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంది కాబట్టి, ఆయన ఫస్ట్ ఛాయిస్ కాంగ్రెస్ పార్టీనే. ఒకవేళ కాంగ్రెస్ తలుపులు మూసుకుంటే, కమలం గూటికి చేరడానికైనా ఆయన వెనకాడరు. మొత్తానికి మల్లారెడ్డి గులాబీ తోటలో ఉండటం తాత్కాలికం మాత్రమే!
-జి.మహేష్ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్-9491383455