త్రికాల తెలుగు: పెద్దపల్లి జిల్లాలోని కూనారం రైల్వే గేట్ వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పింది. సాంకేతిక లోపం కారణంగా రైలు పట్టాలపైనే లారీ ఆగిపోవడంతో సుమారు అర్ధగంట పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూనారం రైల్వే గేట్ దాటుతున్న సమయంలో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇంజన్ మొరాయించడంతో లారీ ఒక్కసారిగా రైలు పట్టాల మధ్యలోనే నిలిచిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో రైలు రావలసి ఉండటంతో లారీ డ్రైవర్, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు వారందరూ కలిసికట్టుగా లారీని వెనక్కి, పక్కకు నెట్టి పట్టాలపై నుంచి పూర్తిగా బయటకు తీశారు.
మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై, అరగంట పాటు ఆ లైన్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. లారీని పట్టాల నుంచి పూర్తిగా తొలగించి, ట్రాక్ క్లియరెన్స్ అయిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.