- తెలంగాణలో ‘క్షుద్ర పూజల’ రాజకీయం
ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయో లేదో కానీ..నేతల మైండ్లలో మూఢనమ్మకాల మబ్బులు కమ్ముకున్నాయి. ఒకవైపు ప్రపంచమంతా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)’ వెనుక పడుతుంటే… తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం ‘ఆర్కైక్ మ్యాజిక్ (AM)’ అలియాస్ ‘క్షుద్ర పూజల’ కథల వెనుక పడుతున్నారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ రాజకీయం ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం చుట్టూ కాకుండా… “ఎవరు ఏ సరిహద్దుల్లో చేతబడులు చేశారు?” అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ చుట్టూ తిరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై జరగాల్సిన రాజకీయ చర్చ కాస్తా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ‘క్షుద్ర పూజలు’ చుట్టూ తిరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ (BRS) మధ్య ఈ అంశంపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, కరువు వాతావరణం మరియు ప్రభుత్వ వ్యతిరేకతను తమ రాజకీయ లబ్ధికి మలుచుకునేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారనే కోణంలో ఈ విమర్శలు మొదలయ్యాయి.

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో వర్షాలు కురవకూడదని, పంటలు పండకుండా ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కర్ణాటకలోని షిమోగ, తమిళనాడులోని తిరుచ్చి తదితర ప్రాంతాల్లో రహస్యంగా తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం కోసమే అరుంధతి సినిమాలోని ‘పశుపతి’ పాత్ర తరహాలో క్రూరమైన సాధనలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే తమ నాయకులపై ఇటువంటి నిరాధారమైన, హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. అసలు రేవంత్ రెడ్డే క్షుద్ర పూజలు చేస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు ఇటువంటి ‘చిల్లర డ్రామాలు’ ఆడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ తదితరులు తిరగబడ్డారు.

నాయకులు ఒకరిపై ఒకరు విసురుకుంటున్న ఈ’ తాంత్రిక ఆరోపణలు’ ప్రజాస్వామ్య ప్రమాణాలను నవ్వులపాలు చేస్తున్నాయి. ఓటర్లకు ‘మేనిఫెస్టో’లు చూపించి ఓట్లు అడగాల్సింది పోయి, ‘మంత్రాల’ పేరు చెప్పి పరస్పరం బురద చల్లుకోవడం విచారకరం. సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో కూడా ప్రధాన పార్టీల నేతలు ‘వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేయడం ఏమిటి?’ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులను శాస్త్రీయంగా విశ్లేషించాల్సింది పోయి, చేతబడులు, తంత్రాలంటూ ప్రచారం చేయడం ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చుతోందని మేధావులు, హేతువాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలులో జాప్యం వంటి ప్రజా సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అధికార పార్టీ ఇలాంటి అస్త్రాలను వాడୁతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ లబ్ధి కోసం అంధ విశ్వాసాలను తెరపైకి తెచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం ప్రమాదకరం. చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, సిద్ధాంతాల మీద పోటీ పడాలి తప్ప, ఇలాంటి తాంత్రిక ఆరోపణల స్థాయికి దిగజారడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా అభివృద్ధి పనుల గురించి కాకుండా, షిమోగ పూజలు, క్షుద్ర శక్తుల చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. రాజకీయాల్లో అత్యంత పదునైన ఆయుధం “ప్రజల దృష్టి మళ్లించడం”. కరువు, ఉపాధి, హామీల అమలు, రుణమాఫీ వంటి పదునైన ప్రశ్నలు ప్రజల నుంచి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వారి దృష్టిని ‘క్షుద్ర పూజలు’, ‘తాంత్రిక శక్తులు’ అనే తీవ్రమైన అంశం వైపు తిప్పాలి. ఒకసారి చేతబడి, మంత్రాల ప్రచారం మొదలైతే, అసలు ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోతాయి. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది.

రాబోయే కాలంలో ఈ ‘క్షుద్ర రాజకీయం’ ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో మేఘాలు కమ్ముకున్నాయో లేదో తెలియదు కానీ… నాయకుల మైండ్లలో మాత్రం మూఢనమ్మకాల మబ్బులు మాత్రం దట్టంగా అలుముకున్నాయి! చేతబడులతో వర్షాలు ఆపగలమనే భ్రమల్లో బతికే ఈ నేతలు గుర్తించాల్సిన అసలు నిజం ఒక్కటే, ప్రజల గుండెల్లోంచి వచ్చే ప్రజా వ్యతిరేకత తుపానును ఏ తాంత్రికుడూ ఆపలేడు !
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455