- హస్తానికి గుడ్‌బై.. కమలానికి జై !?
తెలంగాణ కాంగ్రెస్ కోటలో అసలేం జరుగుతోంది? మంత్రివర్గంలో ఫైర్‌బ్రాండ్‌గా చక్రం తిప్పిన కొండా సురేఖ చుట్టూ ఉన్నట్టుండి రాజకీయ చక్రవ్యూహం ఎందుకు అల్లుకుంటోంది? తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కొండా దంపతులు, ఈసారి కాంగ్రెస్ నాయకత్వంతోనే అమీతుమీ తేల్చుకునే పరిస్థితికి వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొండా సురేఖ, ఆమె కుటుంబం చుట్టూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆమె కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఊహాగానాలు మొదలయ్యాయి.

కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ ఇటీవల పాలకుర్తి వేదికగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ పరిణామాలపై పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడం, దానికి కొండా సురేఖ ఘాటుగా బదులివ్వడం, చివరకు ఈ నివేదిక ఏఐసీసీ (AICC)కి చేరడం కాంగ్రెస్‌లో వారి పరిస్థితిని సంకటంలోకి నెట్టింది. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని, బలహీనవర్గాల నాయకురాలిని కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని సురేఖ స్వయంగా ప్రస్తావించడం పార్టీలో అగాధం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది. వివాదాల కారణంగా కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణలో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన కొండా వర్గంలో కనిపిస్తోంది. ఈ పరిణామాలతో కొండా బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ మొదలైంది.
బీజేపీలోకి వెళ్తామనే సంకేతాలు పంపడం ద్వారా పీసీసీ, అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి తన పదవిని, ప్రాధాన్యతను నిలుపుకోవడమే ఈ ప్రచార వ్యూహం కావచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో సాగుతున్న పెత్తనం పోరులో తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు తాను బయటకు వెళ్తే పార్టీకి నష్టం అనే సిగ్నల్ కాంగ్రెస్‌కు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ వెంటే ఉంటూ కాంగ్రెస్‌ను వీడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే కావడం, కేసీఆర్‌తో విభేదించి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం… ఇలా కొండా దంపతుల రాజకీయ ప్రస్థానంలో ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. తమ ప్రాధాన్యత తగ్గిన ప్రతిసారీ ‘ఆత్మగౌరవం’ పేరుతో పార్టీలు మారిన చరిత్ర వారికి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి ఎదురైతే, బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌లోకి వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను బుజ్జగించి శాంతింపజేస్తుందా, లేక కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుందా అనే దానిపైనే ఈ ‘ఆపరేషన్ కమలం’ ఆధారపడి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ లైట్ తీసుకుంటే మాత్రం, తెలంగాణలో మరో కీలక రాజకీయ మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో పద్మశాలి, ఇతర బీసీ సామాజిక వర్గాలలో కొండా దంపతులకు బలమైన పట్టుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం అలర్ట్ అయింది. కాంగ్రెస్‌లో కొండాపై జరుగుతున్న పరిణామాలపై దృష్టిపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నాయకత్వం కోసం చూస్తున్న బీజేపీకి కొండా ఫ్యామిలీ రాక అదనపు బలం కావచ్చు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి దూకుడుగా మాట్లాడే, బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న బీసీ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. కొండా దంపతుల చేరికతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సరిహద్దుల్లో కమలం పార్టీకి బలమైన బూస్ట్ దొరుకుతుంది. ఒక సిట్టింగ్ మంత్రిని తమ పార్టీలోకి లాగగలిగితే, రేవంత్ రెడ్డి సర్కార్ అస్థిరంగా ఉందనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని బీజేపీ హైకమాండ్ ఆలోచన. బీజేపీలో చేరికపై కొండా మురళితో కొందరు రాష్ట్ర స్థాయి నేతలు రహస్యంగా సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానికంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో కొండా దంపతులకు పడకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉండటంతో బీజేపీ వారికి సరైన ప్రత్యామ్నాయంగా కనిపించే వీలుంది. అయితే, కొండా మురళికి నక్సల్స్, పీపుల్స్ వార్ నేపథ్యం, వామపక్ష భావజాలం ఉన్న చరిత్ర ఉంది. బీజేపీ వంటి తీవ్ర హిందూత్వ భావజాల పార్టీలో కొండా దంపతుల శైలి ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్న. వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు కొండా దంపతుల దూకుడు రాజకీయాలను ఏ మేరకు ఆహ్వానిస్తారనేది మరో కీలకాంశం. కొండా దంపతులు రాజకీయాల్లో ఎప్పుడూ తమదైన స్వతంత్ర దూకుడు శైలితో వ్యవహరిస్తారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్), మళ్లీ కాంగ్రెస్‌లోకి మారిన చరిత్ర వారిది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వారి భవిష్యత్ అడుగులు ఆధారపడి ఉన్నప్పటికీ, ఒకవేళ మంత్రి పదవికి ముప్పు వాటిల్లినా లేదా పార్టీలో ప్రాధాన్యత తగ్గినా “ఆపరేషన్ కమలం” గూటికి చేరడం అసంభవమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి కొండా బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్నది కేవలం రాజకీయ పుకార్లు మాత్రమే. కొండా సురేఖ లేదా ఆమె కుటుంబం బీజేపీలో చేరుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే, రాజకీయాల్లో “నిప్పు లేనిదే పొగ రాదు” అన్నట్లు.. ఈ ప్రచారం తెరపైకి రావడం వెనుక కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ఒత్తిడి రాజకీయాలే ప్రధాన కారణం అన్నది మాత్రం సుస్పష్టం. కేవలం పార్టీ మారే ప్రయత్నం మాత్రమే కాకపోవచ్చు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొండా దంపతులు విసురుతున్న “సైలెంట్ వార్నింగ్” కూడా కావచ్చు. తెలంగాణలో అధికారం అందుకోవాలంటే బలమైన బీసీ ముఖం కావాలని చూస్తున్న బీజేపీకి, కొండా సురేఖ కంటే మెరుగైన ఆప్షన్ దొరకదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పద్మశాలి, ఇతర వెనుకబడిన వర్గాలపై కొండా దంపతులకున్న పట్టు బీజేపీకి తిరుగులేని అడ్వాంటేజ్. కొండా కుటుంబం ఏనాడూ పార్టీల సిద్ధాంతాలకు బందీ కాలేదు. వారికి కావాల్సింది అధికారంలో ప్రాధాన్యత, జిల్లాపై తిరుగులేని పట్టు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ లేకపోతే, వారికి మిగిలిన ఏకైక హై-వోల్టేజ్ ఆప్షన్ ‘కమలం’ మాత్రమే. కాంగ్రెస్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టి కొండా దంపతులను దారికి తెచ్చుకుంటారా? లేక “వెళ్లేవారిని ఆపలేం” అంటూ లైట్ తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం బంతి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులోనే ఉంది. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు శాశ్వతం కాదు.. అధికారం, ఆధిపత్యం మాత్రమే శాశ్వతం. కొండా దంపతుల చరిత్ర చూస్తే, ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏ గూటికైనా ఎగరడానికి వారు వెనుకాడరన్నది కాదనలేని సత్యం. కొండా ఫైర్‌కు కాషాయ మార్గం సుగమం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే!
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్