ఆ కుర్చీపై కేకే కన్ను !

  • ఆ కుర్చీపై కేకే కన్ను…కూతురి కోసం రూటు మార్పు!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ తెరపై ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగుతోంది.. అదే కే. కేశవరావు (కేకే). దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ప్రతి రాజకీయ మలుపులోనూ తనదైన ముద్ర వేస్తూ రాజకీయాలను శాసిస్తున్న ఈ సీనియర్ రాజకీయ చాణక్యుడు, మరోసారి తన రాజకీయ చతురతను అగ్రభాగంలో నిలబెట్టేందుకు తెరవెనుక అత్యంత కీలకమైన పావులు కదుపుతున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని, ముఖ్యంగా తన కూతురు, గ్రేటర్ హైదరాబాద్ పూర్వపు మేయర్ గద్వాల విజయలక్ష్మి భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పొలిటికల్ సునామీని తలపిస్తున్నాయి. కేవలం తన రాజకీయ పునరాగమనంతో సరిపెట్టుకోకుండా, తన రక్తసంబంధాన్ని అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆయన తెరవెనుక సాగిస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు గాంధీభవన్‌ నుంచి హస్తిన వరకు హాట్ టాపిక్‌గా మారాయి. కేవలం ప్రభుత్వ సలహాదారు పదారంతోనే సరిపెట్టుకోకుండా, తన కుమార్తె, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి రాష్ట్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం చేయడమే లక్ష్యంగా ఆయన ఢిల్లీ పెద్దల వద్ద పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం గులాబీ బాస్‌కు గుడ్ బై చెప్పి, కూతురు గద్వాల విజయలక్ష్మితో సహా కాంగ్రెస్ గూటికి చేరిన కేకే, ఇప్పుడు ఆ పార్టీలోనే తన కుటుంబాన్ని అత్యున్నత స్థాయి అధికార కేంద్రంగా నిలబెట్టేందుకు అసలు సిసలైన ‘మాస్టర్ గేమ్’ ఆడుతున్నారు. కేవలం పార్టీ మారడం, ఏదో ఒక నామినేటెడ్ పదవితో సరిపెట్టుకోవడం ఆయన నైజం కాదని మరోసారి రుజువవుతోంది. సరిగ్గా ఇప్పుడు ఆయన చూపు నేరుగా రాష్ట్ర మంత్రివర్గ పీఠంపై పడింది. తనతో పాటు పార్టీలోకి వచ్చిన విజయలక్ష్మికి తెలంగాణ మంత్రివర్గంలో చోటు కల్పించడమే లక్ష్యంగా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కేబినెట్ ప్రక్షాళన, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో… కేకే ఏకంగా ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్‌లు కోరుతూ లాబీయింగ్ వేగం పెంచడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ లాబీయింగ్ వెనుక కేకే చాలా పక్కాగా వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. గద్వాల విజయలక్ష్మికి మంత్రి పదవి తెచ్చే బాధ్యతను స్వయంగా కేకే భుజానేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ ముందు కేకే చాలా పక్కా ప్లాన్‌తో వాదిస్తున్నారట.

ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖను ఆ స్థానం నుంచి తొలగిస్తే, ఆ వెంటనే ఆ ఖాళీ అయిన బెర్త్‌ను తన కుమార్తెకు కేటాయించాల్సిందిగా ఆయన హైకమాండ్ ముందు బలమైన ప్రతిపాదన పెట్టారట. కేవలం వ్యక్తిగత ప్రయోజనంలా కనిపించకుండా, దీనికి సామాజిక సమీకరణాల రంగు పులమడం కేకే రాజకీయ అనుభవానికి నిదర్శనంగా మారుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా కోటా భర్తీ కాలేదనే లాజిక్‌ను ఆయన ఢిల్లీ పెద్దల ముందు గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మున్నూరు కాపులకు, అటు మహిళా కోటా కింద తన కూతురికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజకీయంగానూ, సామాజికంగానూ తిరుగు ఉండదని ఆయన పెద్దలకు వివరిస్తున్నారట.

రాష్ట్ర రాజకీయాల్లో కేకే అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నేరుగా రంగంలోకి దిగి హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కేబినెట్ రేసులో చాలా మంది సీనియర్లు పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో వలస నేత కుటుంబానికి ఏకంగా మంత్రి పదవి కట్టబెడితే పార్టీలో పాత కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే, కేకే ఆడుతున్న ఈ హై-వోల్టేజ్ చెస్ గేమ్‌పై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం చెమటోడ్చిన పాత కాపులు, సీనియర్ నాయకులు కేబినెట్ రేసులో లైన్‌లో నిలబడి ఉంటే… నిన్న మొన్న పార్టీ మారిన వలస నేత కుటుంబానికి ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టడంపై పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఒకరిని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఈ ప్రతిపాదన రాబోయే రోజుల్లో వర్గపోరుకు, అసంతృప్తి జ్వాలలకు దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

గాంధీభవన్‌ నుంచి హస్తిన గడపల వరకు కేకే నడిపిస్తున్న లాబీయింగ్ తంతు ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాను, తన కూతురు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడే ఈ మాస్టర్ ప్లాన్‌కు బీజం పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పుడు సమయం ఆసన్నమైందనే ఉద్దేశంతో ఆయన నేరుగా ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్‌లు తీసుకుని మరీ ఈ మంత్రాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పవర్ గేమ్‌లో కేకే ఎంచుకున్న వ్యూహం అత్యంత చతురమైనదిగా కనిపిస్తోంది. ప్రస్తుత రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాబోయే ప్రక్షాళన లేదా మార్పుల జాబితాపై ఉత్కంఠ నెలకొన్న తరుణాన్ని ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ఎపిసోడ్‌ను ఒక అవకాశంగా మలచుకోవాలనే ఈ ఎత్తుగడ వెనుక కేకే పొలిటికల్ గ్రిప్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ‘కూతురికి మంత్రి పదవి’ అంటే పార్టీలో తిరుగుబాటు వస్తుందనే అంచనాతో.. కేకే దీనికి ఒక బలమైన సామాజిక సమీకరణాల రంగు పులిమారట.

మున్నూరు కాపు కార్డ్ ప్లే చేయడం ద్వారా పార్టీలో ఇతర సీనియర్ల నోరు మూయించవచ్చనేది కేకే వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, అధిష్టానం దీనికి ఏమేరకు తలగ్గుతుందనేది సస్పెన్స్‌గా మారింది. కేకే తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి ఉండవచ్చు, కానీ కూతురి భవిష్యత్తు కోసం ఆయన ఇప్పుడు నడిపిస్తున్న ఈ ఢిల్లీ లాబీయింగ్ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. కేకే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అంతటిని రంగరించి కూతురి రాజకీయ భవిత కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను ఏ మేరకు మెప్పిస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మున్నూరు కాపు కార్డ్, మహిళా సెంటిమెంట్, సురేఖ ఎపిసోడ్ అన్నీ కలిపి కేకే వేస్తున్న ఈ పావులు నిజంగానే ఫలించి గద్వాల విజయలక్ష్మి మంత్రి పీఠంపై కూర్చుంటారా? లేక ఈ లాబీయింగ్ కాంగ్రెస్‌లో సరికొత్త వర్గపోరుకు తెరలేపుతుందా? అన్నది రానున్న కాలమే దీనికి సమాధానం చెప్పాలి! గాంధీభవన్ నుంచి హస్తిన వరకు కేకే నడిపిస్తున్న ఈ పొలిటికల్ చెస్ గేమ్‌లో విజయ్ లక్ష్మికి కేబినెట్ బెర్త్ దక్కుతుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సురేఖ ఎపిసోడ్‌ను అనుకూలంగా మలచుకుని మున్నూరు కాపు కార్డ్‌తో కేకే వేస్తున్న ఈ అడుగులు ప్లాన్ ప్రకారం వర్కౌట్ అవుతాయా? లేక కాంగ్రెస్‌లో కొత్త కుదుపులకు కారణమవుతాయా? వేచి చూడాల్సిందే!

 

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్,

ట్రెండింగ్ న్యూస్